తెలంగాణ రవాణా సౌకర్యాలు
వాయురవాణా:
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు మరియు విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమానాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయం ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. వరంగల్, నిజామాబాదు, కరీంనగర్‌లలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది.
రైలు రవాణా:
సికింద్రాబాదు మరియు కాజీపేటలు తెలంగాణలోని ప్రముఖ రైల్వేజంక్షన్లు. ఇవి దక్షిణ మధ్య రైల్వే లో రైల్వే డివిజన్ కేంద్ర స్థానాలుగా కూడా ఉన్నాయి.హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో 1874లో హైదరాబాదు నుంచి వాడికి రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు నుంచి విజయవాడ మార్గం 1886లో పూర్తయింది. హైదరాబాదు-మన్మాడ్ మీటర్ గేజి మార్గం 1900లో ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, స్వాతంత్ర్యానంతరం బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలు వేశారు. నూతనంగా గద్వాల నుంచి రాయచూర్ మార్గం 2013, అక్టోబరు 12 న ప్రారంభమైంది. దేవరకద్ర నుంచి రాయచూరు, కరీంనగర్ నుంచి పెద్దపల్లితో సహా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.
రోడ్డు రవాణా:
దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచున్నది. పూనా-విజయవాడలను కలిపే 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల మీదుగా పోతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళే జాతీయ రహదారి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల మీదుగా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వెళ్తుంది.
No comments:
Post a Comment