Tuesday, 7 April 2015

తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం

తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు నిజాం నిరంకుశ పాలనలో ఉందని చారిత్రికులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో పాలకుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు నేపథ్యంగా నిలిచాయి.

వెట్టి చాకిరి సమస్య:
గ్రామాలపై పెత్తనం వహించే దొరలకు, గ్రామాధికారులకు గ్రామాల్లోని వివిధ వృత్తులవారు వెట్టి చాకిరీ చేసే పరిస్థితులు నిజాం పాలన కాలంలో నెలకొన్నాయి. దొర ఇళ్లలో జరిగే వివిధ వేడుకలకు, శుభకార్యాలకు గ్రామంలోని అణచివేయబడ్డ కులాల వారి నుంచి మొదలుకొని వ్యాపారస్తులైన కోమట్ల వరకూ ఉచితంగా పనిచేయవలసి రావడం, డబ్బుతో పనిలేకుండా సంభారాలు సమకూర్చడం వంటివి జరిగేవి. గ్రామంలోకి పై అధికారులు వచ్చినప్పుడు జరిగే విందు వినోదాలకు ధాన్యం, మాంసం, కాయగూరలు వంటివి ఇవ్వడానికి ఊరందరికీ బాధ్యతలు పంచేవారు. వంట పని, వడ్డన పని మొదలుకొని అన్ని పనులూ పంచబడేవి. ఇదే కాక నిత్యం దళిత కులాలకు చెందిన వెట్టివారు అధికారులు, దొరల ఇళ్ళలో వెట్టిపని చేసి దయనీయంగా జీవితాన్ని గడపవలసి వచ్చేది. తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమయ్యాకా ప్రజలను ఉత్తేజపరిచే పోరాటగీతాల్లో కూడా విరివిగా వెట్టిచాకిరీ సమస్య చోటుచేసుకుంది.

భావ వ్యక్తీకరణపై ఆంక్షలు:
ఏడవ నిజాం పరిపాలించిన ప్రాంతంలో తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వారు, గణనీయమైన సంఖ్యలో తమిళులు ఉండగా కేవలం ఉర్దూ భాషను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన భాషలను అణచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. విద్య విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోని ఉర్దూభాషకే ప్రోత్సాహం, ఆ భాషను నేర్చినవారికే అవకాశాలు దక్కుతూండేది. ఈ కారణంగా ఇతర భాషలు మాతృభాషగా కలిగినవారు ఉర్దూను నేర్చుకునేవారు. నిజానికి ఉర్దూ భాష విదేశీభాష కానీ, ఒక మతానికి చెందిన భాష కానీ కాదని అది దక్కన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన దేశీయభాషేనని ఆ ప్రాంతీయులు అభిమానించారు. ఉర్దూను ఆదరించి నేర్చి ఆ భాషలో కవిత్వం చెప్పినవారు ఉన్నారు. ఉర్దూపై వ్యతిరేకత లేకున్నా తమ మాతృభాషలను అణచివేయడం అసంతృప్తిగా మారింది. భాష, సంస్కృతుల అణచివేతను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన వివిధ సంస్థలు, భాషోద్యమం, గ్రంథాలయోద్యమాలతో ప్రజాజీవితం ప్రారంభించిన పలువురు నాయకులు సాంఘిక సమస్యలపై చివరకు రాజకీయంగా నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. నిజాం పాలనలో చివరికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ముందస్తు అనుమతులు అవసరమయ్యే పరిస్థితి నెలకొని ఉండేది. పత్రికలను చదవడాన్ని కూడా ఒప్పుకోని జాగీర్దారులు ఉండేవారని దాశరథి రంగాచార్యులు రచించిన మోదుగపూలు వంటి సాహిత్యాధారాలు పేర్కొంటున్నాయి.

ఆర్థిక కారణాలు:
అధికవడ్డీలతో దోపిడీచేసి భూవసతి దోచుకోవడం, ఎక్కువ భూములు కొందరు భూస్వాముల వద్దే ఉండిపోయి సామాన్య రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి స్థితిగతులు ఈ పోరాటానికి మూలకారణమని పలువురు కమ్యూనిస్టు చరిత్రకారులు, ఉద్యమకారులు పేర్కొన్నారు. ఈ వాదన ప్రకారం తెలంగాణా సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం సామాన్యుల తిరుగుబాటు. ప్రపంచంలోని రైతుల తిరుగుబాట్లన్నిటిలోకీ అగ్రస్థానం పొందిందనీ తెలంగాణా సాయుధ పోరాటం చూసి ప్రపంచమే విస్తుపోయిందనీ పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నేతలు పేర్కొన్నారు. ఆర్థికపరమైన విషయాలే సాయుధపోరాటానికి ముఖ్యమైన కారణాలని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment