Tuesday, 7 April 2015

నిజాం పాలనలో దురాగతాలు

నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగావేలాడదీసేవారు. చెవులకు బరువులు కట్టడం, నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు. తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు, కిరాతకులు రజాకార్లు.
నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు(బానిసలు). సామాజికంగా 'వెట్టి' అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది. యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్ మూఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు. చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరసగా నిలబెట్టి తుపాకులతో కాల్చేవారు, బహిరంగంగా సామూహిక మానభంగాలు జరిపేవారు.దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు. 1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు.

No comments:

Post a Comment