Sunday, 12 April 2015

తెలంగాణ బౌద్ధమత క్షేత్రాలు

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము):
భౌద్ధం ఆనవాళ్ళు:    


కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది.


కోటిలింగాల:

కోటిలింగాల, కరీంనగర్ జిల్లా, వెలగటూరు మండలానికి చెందిన గ్రామము. కోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో, గోదావరి నది, పెద్దవాగు సంగమస్థలంలో ఉన్నది. గ్రామానికి ఉత్తరాన పడమర నుండి తూర్పుకు ప్రవహించు గోదావరి నది కలదు. గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం (శివాలయం) కలదు. గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్న పెద్దవాగు కలదు. ఈ రెండు కలిసే చోటు మునేరు అందురు. వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట. అందుకే ఆ పేరు వచ్చింది. కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము. చరిత్రకారులు ఇది శాతవాహనుల తొలి రాజధానిగా భావిస్తున్నారు. శ్రీపాద సాగర్ ప్రాజెక్టు (ఎల్లంపల్లి ప్రాజెక్టు) పూర్తయితే జలాయశ్రపు నీటిలో కోటిలింగాల చారిత్రక ప్రదేశము మునిగిపోతుందని భావిస్తున్నారు.
కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు. కోటలో లింగముండటం వళ్ల కోటలింగమైంది. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్దకోట ఉండేది. దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిధిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్టించగా దానిని కోటలింగం అని, అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులోని దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.
ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబటి తూర్పు పడమరగా, మరియు పెద్దవాగు ఉత్తర దక్షిణములుగా దాదాపు 300 మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలియుచున్నది. ఇక్కడ పురావస్తు శాఖ వారు రెండు సార్లు త్రవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979లోత్రవ్వకాలు జరిపినపుడు ఈ ప్రాచీన నగరం బయల్పడింది.
మూడూ దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనులూ రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నాడు. పైఠాన్, ధాన్యకటకంలకు ముందు ఇదే శాతవాహనులకు రాజధానిగా పనిచేసిందని జైశెట్టి రమణయ్య, శాతవాహనుల జన్మభూమి తెలంగాణయే అనే విషయంలో సందేహానికీ రావులేకుండా పోయిందని శ్రీరామశర్మ, శాతవాహనులు తొలుత కోటిలింగాలలోనే రాజ్యమొనర్చినారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బి.ఎన్.శర్మ వివరించారు.

ధూళికట్ట:

గ్రామం నుండి బౌద్ధ క్షేత్రానికి పక్కా రోడ్డు లేనందువళ్ల, కేవలం ఎద్దులబండిలోనే అక్కడికి చేరుకొనే అవకాశముంది.ధూళి కోట (మట్టి కోట) కాలక్రమంలో ధూళికట్టగా అపభ్రంశమైందని భావిస్తున్నారు. ఇది శాతవాహనుల కాలంనాటి ఆవాసము. మెగస్తనీసు ఇండికాలో ప్రస్తావించిన ఆంధ్రుల యొక్క ముప్పై కోటలలో ధూళికట్ట ఒకటని శాసనాధారాల వళ్ల తెలుస్తున్నది.[3] పురావస్తు త్రవ్వకాలలో ఇక్కడ చెవిదుద్దులు, శంఖు గాజుముక్కలు, దంతపు దువ్వెన, స్త్రీబొమ్మ లభించాయి.ఇక్కడ నివసించిన ప్రజల మతపద్ధతులకు సంబంధించి మాతృదేవత, యక్షుల శిల్పాలు తప్ప పెద్దగా ఆనవాళ్ళు దొరకలేదు. బౌద్ధస్థూపాలు బయల్పడే వరకు ఇది ఒక చిక్కుముడిగా ఉండేది. 1975-76లలో పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఇక్కడ శాతవాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధస్థూపం బయటపడ్డాయి. నాగముచుకుంద నాగశిల్పం కూడా లభించింది.

నేలకొండపల్లి:

నేలకొండపల్లి, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.
పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేసాడు. ఆ విరాటనగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం. 1977 లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని రూఢి అవుతున్నది.ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరం గా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

పెద్దబొంకూర్:

ఇది శాతవాహనుల కాలం నాటి గ్రామం. పెద్దబొంకూర్‌లో శాతవాహనుల కాలంలో నిర్మించిన బావి కనుగొన్నారు. గ్రామంలోని చారిత్రక ప్రదేశంలో ఒకటో శతాబ్దానికి చెందిన సూర్య విగ్రహం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో లభించిన మొదటి సూర్య ప్రతిమ ఇదే కావడం విశేషం. పెద్దబంకూర్ గ్రామంలో 1970-76 సంవత్సరాల మధ్య, 1983లో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల నాణాలు, మట్టిగాజులు, ఎముకలతో తయారు చేసిన ఫ్రేములు, రాతి ఆయుధాలు, ఉంగరాలు, చతురస్త్రాకారంలో నిర్మించిన బావులు, మాతృమూర్తి విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో లభ్యమైన టెర్రకొట్టా ముద్రికపై క్రీ.పూ రెండవ శతాబ్ది నాటి బ్రాహ్మీలిపి లక్షణాలతో ‘విజయ పురహర కస రథస’ అని చెక్కి ఉంది.

ఫణిగిరి:

ఫణిగిరి, నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామము ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఒక పెద్ద స్తూపం ఉన్న సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద సభామందిరాలు బయట పడ్డాయి. ఈ ప్రాంతపు పరిమాణాన్ని బట్టే ఒకప్పుడు ఇది బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిందని చెప్పుకోవచ్చు. ఈ సముదాయంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పెద్ద పాదముద్రలు బుద్ధనివిగా భావిస్తున్నారు.. ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఈ గ్రామస్తుడే.
బౌద్ధం ఆనవాళ్ళు:2001 నుంచి 2007 వరకు ఆరేళ్ళ పాటు జరిపిన తవ్వకాల్లో మహాస్తూపం, చైత్యగృహాలు, ఉద్దేశిక స్తూపాలు, బుద్ధుని ప్రతిమలు, బౌద్ధచిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ, గౌతముని జీవిత ఘటాలు మలిచిన అపురూప శిల్పాలు, శాత వాహన క్షేత్రాలు, ఇక్ష్వాకుల, మహావీరుల నాణలు, మట్టి, సున్నపు బొమ్మలు పూసలు లభించాయి. ఉత్తర భారత దేశాన్ని దక్షణ పథంతో కలిపే ఒకప్పటి జాతీయ రహదారిపై విలసిల్లిన ఫణిగిరి, హీన యాన, మహాయాన బౌద్ధ శాఖలకు నిలయమై ప్రసిద్ధ బౌద్ధాచార్యుల ఆవాసంగా ఉన్నట్లు తెలిపే ఆధారాలు దొరికాయి. ఈ మధ్య చేపట్టిన తవ్వకాల్లో తొలిసారిగా ఏడవ రోమన్‌ చక్రవర్తి నెర్వ క్రీ.శ 96-98 విడుదల చేసిన 7.3 గ్రాముల బరువు గల బంగారు నాణం బయటపడింది.

శాసనాలూ, ఆధారాలూ శ్రీ పర్వత, విజయపురిల ను పాలించిన ఇక్షాక రాజు ఎహువల శాంతమూలుని 18 వ పాలన కాలానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ లభించాయి. ఇంత వరకు ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు లభించగా 18 ఏళ్లు ఆ రాజు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది అదే శాసనంలో శ్రీ క్రిష్ణుని ప్రస్తావన కూడా ఉంది ఇలా క్రిష్ణుని పేర్కొన్న తొలి శాసనం కూడా ఫణిగిరి దగ్గర దొరకడం మరో ప్రత్యేకత


No comments:

Post a Comment